బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : మంత్రి సీతక్క

బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : మంత్రి సీతక్క
  • దక్షిణాఫ్రికా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్యం, విద్యుత్, రహదారులు, తాగునీరు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దక్షిణాఫ్రికాలో ‘సౌత్  ఆఫ్రికా తెలంగాణ అసోసియేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అక్కడి తెలంగాణ ఆడబిడ్డలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

ముందస్తు ఏర్పాట్లు చేయాలి..

బతుకమ్మ పండుగ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, జిల్లా అధికారులు, కలెక్టర్లు సమన్వయంతో పని చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, బతుకమ్మ ఆడే ప్రాంతాలు, చెరువులు, కుంటలు, ఘాట్‌‌‌‌ల పరిసరాల్లో చెత్త లేకుండా చూడాలని సూచించారు. బతుకమ్మ ఘాట్‌‌‌‌లకు వెళ్లే రోడ్లకు రిపేర్లు చేయాలన్నారు. వేడుకల్లో పాల్గొనే మహిళలు, వృద్ధులు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఘాట్ల వద్ద మెట్లు, ర్యాంపులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.